సంగారెడ్డి : సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగ చర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీ ఈర్యా నేడు గుండెపోటుకు గురయ్యారు. అయన తనకు చాతీ నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి చెప్పడంతో హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ, 2 డీఏకో పరీక్షలు చేయించారు. ప్రస్తుతం అతడి పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కాగా గత నెల 11న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న ఖైదీ ఈర్యా గతంలోనే తనకి గుండె సమస్య ఉన్నట్టు వెల్లడించారు. మూడు నెలల కిందే ఇంటి వద్ద ఆస్పత్రికి వెళ్లగా స్టంట్ వెయ్యాలని వైద్యులు చెప్పినట్లు ఖైదీ వెల్లడించారు. కానీ తన ఆర్థిక పరిస్థితుల వల్ల సర్జరీ చేయించుకోలేదని తెలిపారు. రిమాండ్ ఖైదీ ఈర్యాకు సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బేడీలతో వైద్య పరీక్షలు ఈర్యాను తీసుకురావడం పట్ల బిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించింది.