ఆంధ్ర ప్రభ స్మార్ట్ – జడ్చర్ల : ఆర్టీసీ బస్సు, డిసిఎం వాహనం ఢీకొన్న ఘటనలో అదుపు తప్పిన ఆర్టీసీ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం జాతీయ రహదారి – 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రమాణికులంతా నిద్రలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.
ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు ఆదివారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో ఏపీకి బయలు దేరింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే డీసీఎం వాహనం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన దాటి కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
మిగిలిన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బస్సు నుంచి బయట పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రయాణికులే బయటకు తీసుకు వచ్చారు. ప్రమాద సమాచారం తెలియడంతో పోలీసు సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేలోపు బస్సు పూర్తిగా దగ్మైంది. ప్రమాదం జరిగిన అరగంటలోపే బస్సు పూర్తిగా దగ్ధమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
108 సిబ్బంది క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు అప్రమత్తమై గాయపడిన వారిని బయటకు తీసి ఉండకపోతే అంతా అగ్నికి ఆహుతై పోయేవారు.
. ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న వారిలో అనంతపురంకు చెందిన లక్ష్మీదేవి సంజీవ, మోహన్ (కూకట్‌పల్లి, హైదరాబాద్), మైథిలి (హైదరాబాద్), కార్తిక్ (నంద్యాల), దస్తగిరి (నంద్యాల), హీరాలాల్ (కోఠి, హైదరాబాద్), అర్చన (నాచారం, హైదరాబాద్), సునీల్ (అనంతపురం), గాయత్రి (అనంతపురం)తో పాటు మరికొందరు ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో 15 మందికి పైగా గాయపడ్డారు. అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లిన చోట విద్యుత్తు తీగలు తాకడం వల్ల మంటలు చెలరేగి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.