హైదరాబాద్, ఆంధ్రప్రభ: రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో భాగంగా ఇటీవల కేంద్ర రోడ్డు-రవాణాశాఖ జారీ చేసిన రెండు గెజిట్ల పరిధిలోని ప్రాంతాల్లో అభ్యంతరాల స్వీకరణ తుదిదశకు చేరింది. ఈమేరకు భువనగిరి, అంధోల్-జోగిపేట్ నుంచి దాదాపు 20 వరకు అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. గత ఏప్రిల్ 19వ తేదీన కేంద్రం విడుదల చేసిన రెండు గెజిట్ల మేరకు స్థానిక అధికారులు గ్రామాల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. చౌటుప్పల్ నుంచి 9, అంధోల్-జోగిపేట్ నుంచి 11 వచ్చినట్టు సమాచారం. మొత్తం 778.89 ఎకరాల భూమికి ఈ అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది.
ముఖ్యంగా చౌటుప్పల్లో ఆర్ఆర్ఆర్ జంక్షన్ రోడ్డు, ఇంటర్ఛేంజ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్లు తెలుస్తోంది. అంధోల్-జోగిపేట్ నుంచి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. గ్రామాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై సమగ్రంగా విచారణ జరిపి స్థానికుల సందేహాలను తొలగించే ప్రయత్నం ఎన్హెచ్ఏఐ చేయనుంది. ఆతర్వాత ఆర్ఆర్ఆర్ తుది అలైన్మెంట్ పూర్తయ్యాక భూసేకరణ కీలంగా మారనుంది. ఈ ప్రక్రియకు ఇంకా మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.