భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల పంచాయతీ అధికారి ఎంపీఓ బత్తిని శ్రీనివాస్, మర్కోడు పంచాయతీ కార్యదర్శి తాటి నాగరాజులు, మర్కోడు ఉపసర్పంచ్ కుర్ర కమల చేసిన అభివృద్ధి పనులకు కమీషన్ కావాలని, బిల్లులు పాస్ చేయడానికి ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయలు కమిషన్ లంచం కావాలని, ఉపసర్పంచ్ కుర్ర కమలను డిమాండ్ చేయడంతో లంచం ఇవ్వడంలో ఆమె నిరాకరించి, ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించారు.
ఆ క్రమంలో బుధవారం కార్యాలయంలో ఎంపీఓ శ్రీనివాస్, కార్యదర్శి తాటి నాగరాజులు 15వేల రూపాయలు కుర్ర కమల వద్ద తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఉమ్మడి జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు. అనంతరం ఫైళ్లు, తదితర అంశాలను పరిశీలిస్తున్నామని, 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏసీబీ దాడుల కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రతీష్, ఏఎస్ఐ వెంకటరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు.