హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాన్‌బెయిలబుల్ వారెంట్ పేరిట రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను గురువారం నాడు ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటరమణ అనే వ్యక్తిపై 2022లో రెండు కేసుల్లో నాన్ బేయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు- జారీ అయ్యాయని, అరెస్టు తప్పదని బాధితుడిని ముగ్గురు కానిస్టేబుళ్లు బెదిరించారు. అదేవిధంగా అరెస్టు చేయకుండా ఉండాలంటే తమకు రూ.5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈక్రమంలో బాధితుడు వెంకటరమణ పోలీసులు భయపడి ఇతరుల దగ్గర అప్పు చేసి మూడు లక్షల రూపాయలు చెల్లించాడు. అయితే ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న మిగతా రెండు లక్షల రూపాయలను కూడా చెల్లించాలని పలు దఫాలుగా కానిస్టేబుళ్లు బాధితుడని వేధించారు. ఈక్రమంలో బాధితుడు తండ్రి అతని సోదరుడు కలిసి పలు సందర్భాల్లో ముగ్గురు కానిస్టేబుల్లకు మిగతా డబ్బును కూడా చెల్లించారు.
అయినా అదనంగా మరింత డబ్బులు ఇవ్వాలని వేధించడంతో బాధితుడు వెంకటరమణ ఏసీబీని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గత ఏడాది అక్టోబర్ నెలలో ఎసిబి కేసు నమోదు చేసింది. అప్పటినుండి కేసుకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టిన ఎసిబి అధికారులు చైతన్యపురి పోలస్ స్టేషన్లో సోదాలు నిర్వహించిన అనంతరం ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంది.
నిందితుల అనుచరులపైనా కేసు..
చైతన్యపురి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మల్లేశం, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు, కోర్ట్ కానిస్టేబుల్ నరేందర్‌లను ఏసీబీ అరెస్టు చేసింది. వీరితోపాటు కానిస్టేబుల్ అనుచరులపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. మొత్తం ఏడుగురిని విచారించిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టు చేసింది. నిందితులను ఎసిబి కోర్టులో హాజరుపర్చగా 14రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా ఈ వ్యవహారంపై మిగతా సిబ్బంది పాత్ర గురించి దర్యాప్తు చేస్తున్నటుల ఎసిబి డిఎస్పి శ్రీకాంత్ తెలిపారు.