మహబూబ్ నగర్, సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్): ఆరాచకం సృష్టిస్తున్న ఏబీవీపీ గుండాలను శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తమ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఏబీవీపీ ఇలాంటి దాడులు చేస్తోందని, దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఏబీవీపీ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నుండి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ ఎదుగుదలను ఓర్వలేని మతోన్మాద ఏబీవీపీ ఈ సమావేశాలు అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో గురువారం రాత్రి కర్రలతో, రాళ్ళతో ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేశారన్నారు. ప్లీనరీ ఏర్పాట్లలో జెండాలు, బ్యానర్స్ కడుతుంటే కావాలని గొడవ సృష్టించి రాళ్ళతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ పై దాడి చేశారన్నారు. రమేష్ తో పాటు సంగారెడ్డి జిల్లా నాయకత్వంపై తీవ్రంగా దాడిచేశారన్నారు.
సామాన్య ప్రజలను సైతం బెంబేలెత్తించారన్నారు. పార్క్ చేసిన ఆటోను సైతం ధ్వంసం చేసి రమేష్ పై రాళ్ళతో దాడి చేసి తలపగలగొట్టారన్నారు. విద్యార్ధి సంఘం పేరుతో ఏబీవీపీ ఆరాచకాలు సృష్టిస్తుందని, విద్యార్ధి సమస్యలపై చేతనైతే పోరాడాలి, కానీ పోరాడుతున్న ఎస్ఎఫ్ఐపై దాడి చేసి ఎదుగుదలను అడ్డుకోవాలని అనుకుంటే చరిత్రలో ఏం జరిగిందో ఏబీవీపీ తెలుసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. సమాజంలో ప్రజలకోసం పనిచేసే వారిని తయారు చేయాలి కానీ ఆరాచకలు సృష్టించేవారిని కాదని ఎద్దేవా చేశారు. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నాయకులపై చేసిన ఈ దాడిని ప్రజాస్వామిక వాదులు, మేథావులు, అభ్యుదయ శక్తులు ఖండించాలని మహబూబ్ నగర్ జిల్లా శాఖ తరపున ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుందన్నారు. ఆరాచకం సృష్టిస్తున్న ఏబీవీపీ గుండాలను శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, అధ్యక్షుడు భరత్, ఉపాధ్యక్షుడు ఈశ్వర్, నాయకులు నందు, శ్రీనాథ్, అంజి మణికంఠ, రము, బతలయ్య, అంజి, తదితరులు పాల్గొన్నారు.