Friday, November 22, 2024

తెలంగాణలో ఆమ్ ఆద్మీ కమిటీలు.. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్ల నియామకం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్, తెలంగాణ ఎలక్షన్ ఇన్చార్జి సోమనాథ్ భారతి సంయుక్తంగా పార్టీలో నియామక ప్రక్రియ చేపట్టారు. 17 కన్వీనర్లకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు శిక్షణనిచ్చే బాధ్యతలు అప్పగించారు.

నియోజకవర్గాల కన్వీనర్లలో సికింద్రాబాద్ తరఫున ఇందిరా శోభన్, ఖమ్మం తరఫున దిడ్డి సుధాకర్, నిజామాబాద్ తరఫున బుర్రా రాము గౌడ్, వరంగల్ నుంచి సురేశ్ తాళ్లపల్లి తదితరులున్నారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేసిన ఇందిరా శోభన్, రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement