ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో రాఖీ పండుగను పురస్కరించుకొని సోదరుడు చెల్లితో రాఖి కట్టించుకొని భార్య తో పాటు బైక్ పై తిరుగు ప్రయాణంలో ఇంటినుంచి వెళ్లిన కొద్దిసేపట్లోనే మహిళ అనంతలోకాలకు వెళ్ళింది. ఈ ఘటన పండుగ పూట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు సమీపంలో నీలిమ దాబాకు ఎదురుగా నాలుగు వరుసల జాతీయ రహదారిపై గురువారం జరిగిన బైక్ ను కారు డీకొట్టిన సంఘటలో మహిళా మృతిచెందింది. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన లింగన్న గత కొన్ని రోజులుగా ఉపాధి కోసం నిర్మల్ వెళ్లి ఉంటున్నారు. రాఖీ పండుగ సందర్భంగా కనుగుట్ట గ్రామంలో లింగన్న చెల్లి దగ్గరకు భార్య నర్సావ్వ (40) తోపాటు తమ్ముడు కళ్యాణ్ తోకల్సి బైక్ వచ్చారు.
రాఖీ కట్టించుకొని ముగ్గురు కలిసి ఒకటే బైక్ పై నిర్మల్ కు వెళ్తున్న క్రమంలో నేరడిగొండ పెట్రోల్ పంపు దగ్గర కారు వేగంగా వచ్చి బైక్ ను డీ కొట్టింది. దీంతో నర్సవ్వ, లింగన్న, కళ్యాణ్ ముగ్గురు బైక్ పై నుండీ కింద పడ్డారు. దాంతో నర్సవ్వ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. అన్నదమ్ములకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సాయన్న సిబ్బంది క్షతగాత్రులను ఎన్ హెచ్ఐ అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శవాన్ని విచారణ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనను చూసిన జనం పండుగ రోజు విషాదం జరగడాన్ని జీర్ణించుకోలేక పోయారు.