మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన
హైదరాబాద్, ఆంధ్రప్రభ : వైద్యం కోసం వెళ్లిన ఓ మహిళపై ఓ నర్సు విరుచుకుపడి తిట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మంగళవారం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. దామరగిద్ద మండలం కందేన్‌పల్లికి చెందిన నారమ్మ (32) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో సోమవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఓ నర్సు నారమ్మపై విరుచుకుపడింది. ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే కాకుండా చేయి కూడా చేసుకుంది.
మనస్తాపంతో ఆత్మహత్య..
నర్సు తిట్టిందని మనస్తాపం చెందిన ఆ మహిళ మంగళవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని బాత్‌రూంలోకి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బంధువులు తలుపులు బద్దలుగొట్టి చూడగా, ఉరేసుకుని నారమ్మ కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నర్సు దుర్భాషలాడుతూ చేయి చేసుకుందనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.