Friday, November 22, 2024

రైతులకు చేసిన సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి… బండి సంజయ్

గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద దాదాపు 3వేల కోట్ల నిధులు విడుదల చేస్తే ఇప్పటి వరకు సగానికిపైగా ఖర్చు చేయకుండా దారి మళ్లించారని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులతో ఎంత మంది రైతులకు సాయం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల చెరువు గండిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు, అకాల వరదలతో 9 ఏళ్లుగా తెలంగాణ రైతాంగం నష్టపోతుంటే పైసా ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేయడమేంటని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

ఫసల్ బీమా పథకంపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన విమర్శలనూ బండి సంజయ్ తిప్పికొట్టారు. ఫసల్ బీమా పథకం బాగాలేకుంటే… 9 ఏళ్లుగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారని నిలదీశారు. ఫసల్ బీమా స్కీం కోసం ఇన్సూరెన్స్ సంస్థలకు కేటాయించిన నిధులకంటే… రైతులకు చేసిన సాయం తక్కువని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం… రైతు బీమా పథకం విషయంలో చేసిందేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే… రైతు బీమా అమలు కోసం ఇప్పటి వరకు బీమా కంపెనీలకు కేటాయించిన నిధులెన్ని? ఆ పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకు ఎంత సాయం అందించారనే వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనను బీజేపీ స్వాగతిస్తోందని చెప్పిన బండి సంజయ్ కుమార్… ఈ విషయంలో గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి బీజేపీని బదనాం చేసే నీచమైన కుట్రలకు మానుకోవాలని సూచించారు. ‘‘ఆగమేఘాలపై బిల్లును పంపి సంతకం చేయమంటే ఎలా ? ఆ బిల్లులో ఏమైనా లోపాలున్నాయా ? న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయా ? కార్మికులకు పూర్తిగా న్యాయం జరగాలంటే ఏం చేయాలి ?’’అనే దానిపై గవర్నర్ పరిశీలించే సమయం ఇవ్వకుండా రబ్బర్ స్టాంప్ లా సంతకం పెట్టమంటే ఎలా ? అని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలను బండి సంజయ్ పరామర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రష్ణారెడ్డితో పాటు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కేశవపట్నంలో గండిపడ్డ కల్వల ప్రాజెక్టుతో పాటు వీణవంక మండలంలోని కనపర్తి గ్రామ శివారులో దెబ్బతిన్న పూర్తిగా కోతకు గురైన రోడ్డును, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement