- వీరబద్రారం అడవుల్లో ఘటన
- గాయపడిన గిరిజనుడికి వరంగల్ ఎంజీఎంకు తరలింపు
- ఉలిక్కిపడిన ఏజెన్సీ వాసులు
ఆంధ్రప్రభ స్మార్ట్, వాజేడు (ములుగు జిల్లా) : ములుగు జిల్లా వాజేడు మండలం నూగురు వెంకటాపురం సమీపాన వీరబద్రారం అడవుల్లో మందుపాతర పేలి అంకన్నగూడెం వాసి బొగ్గుల నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం జరిగిన ఈ సంఘటనతో ఏజెన్సీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాయపడిన నవీన్‌ను అంబులెన్స్‌లో తీసుకు వెళ్లి ఏటూరు నాగారం సామాజికాస్పత్రికి చేర్పించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వెంకటాపురం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
సంఘటన జరిగిందిలా…
ఏజెన్సీ వాసులు వంట చెరకు నిమిత్తం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళుతుంటారు. ఎప్పటిలాగే అంకన్నగూడెం వాసులు కుర్సం ఎడమయ్య, సోడి నర్సింహరావు, బొగ్గుల నవీన్ సమీపాంలో ఉన్న వీరబద్రారం అడవులకు వెళ్లారు. అడవిలో వంట చెరకు సేకరిస్తుండగా బొగ్గుల నవీన్ క్లైమోర్ మైన్ పై కాలు వేశాడు. వెంటనే మైన్ పేలింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఆయనకు కొంచెం దూరంలో ఉన్న మిగిలిన ఇద్దరు గాయపడిన నవీన్‌ను అడవుల నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం వెంకటాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అంబులెన్స్ గ్రామంలోకి వచ్చి గాయపడిన నవీన్‌ను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల నిమిత్తం వరంగల్ ఎంజీఎంం ఆస్పత్రికి తరలించారు.