పక్షులు, ప్రకృతి అంటే చాలా మంది ఇష్టపడుతారు. అయితే పక్షి జాతులను గుర్తించి వాటిని ఫొటోలు తీయడం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటిది ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉన్న వ్యక్తి అదే పనిగా వారాంతాల్లో పక్షులను గాలిస్తూ.. వాటి వెరైటీలను తెలుసుకుంటూ కెమెరాలో బంధించడాన్ని అలవాటు చేసుకున్నాడు. కాగా, అలా మెల్లగా ప్రారంభమై ఇప్పుడు రికార్డు నెలకొల్పే దిశగా వెళ్లున్నాడు.. ఆ ముచ్చట్లేంటో చదివి తెలుసుకుందాం..
అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన ఫ్రెండ్తో తొలుత టూర్‌కి వెళ్లాడు. అక్కడ కనిపించిన పక్షులను ఫొటోలు తీసుకున్నాడు. అయితే అలా మెల్లగా వాటి జాతులు, వివరాలను తెలుసుకుంటూ వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా మారాడు. అంతేకాకుండా అరుదైన రికార్డును సాధించాడు. 400 పక్షి జాతులను డాక్యుమెంట్ చేశాడు. ఈ ప్రక్రియలో తెలంగాణలో 400 పక్షి జాతులను చూసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన బర్డ్ శ్రీరామ్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కనిపించిన 434 పక్షులలో 400 పక్షి జాతులను డాక్యుమెంట్ చేసిన మొదటి వ్యక్తి.
2015లో ఉస్మాన్ సాగర్ మీదుగా ఎగురుతున్న రంగురంగుల ఫ్లెమింగోల గుంపును చూసి బర్డ్ ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నాడు. ఈ నాలుగు సంవత్సరాల్లో శ్రీరామ్ రెడ్డి తన కెమెరాలో పక్షులను బంధించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలకు వీకెండ్లలో వెళ్లేవాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీరామ్‌రెడ్డి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చారు. అప్పటి నుండి అతను వీకెండ్స్లో ట్రెక్కింగ్ చేయడం, ల్యాండ్‌స్కేప్‌ల ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
అయితే.. 2015వ సంత్సరం జూలై లో ఫ్లెమింగోలను చూడటానికి అతని ఫ్రెండ్ ఉస్మాన్ సాగర్‌కు తీసుకెళ్లేవాడని, అప్పట్లో తనకు పక్షుల గురించి ఏ మాత్రం అవగాహన లేదని చెప్పాడు. అయితే డెక్కన్ బర్డర్స్, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్‌బీపీ)ని చూసినప్పుడు.. పక్షులపై పనిచేస్తున్న కమ్యూనిటీల గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశానని తెలిపాడు ఈ టెకీ..
హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) వ్యవస్థాపక సభ్యుడు ఫణి కృష్ణ రవి సలహాను అనుసరించి 2015 అక్టోబర్ నుంచి శ్రీరామ్ రెడ్డి ఫొటోలను తీయడం ప్రారంభించాడు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షుల పరిశీలనల డేటాబేస్ అయిన eBirdలో వాటిని అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. డేటాబేస్‌ను పరిశీలించిన తర్వాత శ్రీరామ్ రెడ్డి పాత రికార్డును చూశానని.. అప్పటి వరకు తెలంగాణలోని 360 పక్షి జాతులలో 348 పక్షి జాతులను ఆశిష్ పిట్టే ఫొటో తీసినట్టు గుర్తించాడు. అప్పటి నుంచి ఆశిష్ పిట్టే పనిని అధ్యయనం చేశానని, తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటించినట్టు తెలిపాడు. కానీ అప్పట్లో 300 పక్షి జాతులను తాను ఫొటోలు తీయగలనని ఊహించలేదని చెప్పాడు.
సంగారెడ్డి జిల్లాలోని మంజీర వన్యప్రాణుల అభయారణ్యంలో చూసిన 294 పక్షి జాతులలో 290 పక్షి జాతులను ఇతను ఫొటోలు తీశాడు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పక్షులకు సంబంధించిన హాట్‌స్పాట్‌లను సందర్శించాడు. భారత గడ్డపై ఇప్పటివరకు చూసిన 1,350 పక్షులలో 928 జాతులను డాక్యుమెంట్ చేశాడు. సుప్రసిద్ధ పక్షివేత్త శశాంక్ దాల్వీ దేశంలో అత్యధిక పక్షి జాతులను (1,234) ఫొటోలు తీసి రికార్డు నెలకొల్పాడు. కాగా, శ్రీరామ్ రెడ్డి దేశంలోని కొన్ని ప్రముఖ ప్రదేశాలను సందర్శించడం ద్వారా 2022 చివరి నాటికి 1,000 పక్షి జాతుల ఫొటోలు తీసి ఆ మైలురాయిని దాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతున్నాడు.
పొరుగున ఉన్న కర్నాటక, కేరళలో కాకుండా తెలంగాణలోని చాలా ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలు పక్షి ప్రేమికులను అన్వేషణ కొనసాగలేదని శ్రీరామ్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కొత్త పక్షి జాతులను నమోదు చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. రాష్ట్రంలో 400 పక్షి జాతుల నివేదికను పూర్తి చేయడానికి ఇటీవల నిజామాబాద్ సమీపంలోని పల్లాస్ గుల్‌ను ఫొటో తీశాడు. తెలంగాణలో 392 పక్షి జాతులను డాక్యుమెంట్ చేసిన అతని సన్నిహిత మిత్రుడు ఫణి కృష్ణరావు కూడా అతనికి తోడుగా ఉన్నారు. శ్రీరామ్ రెడ్డి ఫొటోగ్రాఫ్‌లు తెలంగాణ బయో డైవర్సిటీ జర్నల్‌లో, అనేక ఇతర పుస్తకాలలో ప్రచురితమయ్యాయి.