న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బ్రిటిషర్లకు పట్టిన గతే కేసీఆర్‌కూ పడుతుందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. బరితెగించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌కు ఎందుకింత అహంకారమని ప్రశ్నించారు. గురువారం బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణా భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, కోలార్ ఎంపీ మునుస్వామి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, బీజేపీ కేంద్ర-రాష్ట్ర సమన్వయకర్త బాల్‌రాజ్ నూనె తదితరులతో కలిసి భీం దీక్ష చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష చేపట్టినట్టు తెలిపారు.
ఢిల్లీతో పాటు రాష్ట్ర కార్యాలయంలో, అన్ని జిల్లాల్లోనూ నిరసన దీక్షలు చేపట్టామన్నారు. తప్పు చేసి టీఆరెస్ నేతలు తమ వ్యాఖ్యలను సమర్ధించుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక సామాన్య వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షనేనని స్వయంగా ప్రధానే చెప్పుకొచ్చారని బండి సంజయ్ గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాకొద్దు… నేనే రాజ్యాంగం రాస్తా… కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తా అన్నట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తననెవరూ ప్రశ్నించవద్దు… ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా నన్నెవరూ నిలదీయవద్దన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయక పోవడానికి కారణం కూడా ఇదేనని బండి సంజయ్ వెల్లడించారు. నేడు రాజ్యాంగం మార్చాలన్నారు…. రేపు జాతీయ జెండాను, జాతీయ గేయాన్ని కూడా మార్చాలంటారేమోనని ఆయన విస్మయ్ వ్యక్తం చేశారు.
రేపు జైం భీం పాదయాత్ర..
రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వరుస నిరసనలు, ఆందోళనలకు సిద్ధమవుతోంది. శుక్రవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ భీం పాదయాత్ర చేయబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ నుండి ప్రారంభం కానున్న పాదయాత్రలో బండి సంజయ్‌తో పాటు ఎంపీలు సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్, కోలార్ ఎంపీ మునుస్వామి తదితరులు పాల్గొంటారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,