ఖమ్మం : దశాబ్దాల నుండి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముప్పు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.
దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ… యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది… ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
పదిరోజుల్లో మళ్ళీ వస్తా… పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే ఊరుకునేది లేదన్నారు. రెవెన్యూ అధికారులు మున్నేరుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలన్నారు. గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించాలన్నారు.