Wednesday, September 25, 2024

TS: తెలుగు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.. చాడ వెంకట్ రెడ్డి

కేంద్రం విభజన హామీలను నెరవేర్చాలి
ప్రభ న్యూస్, వరంగల్ : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగులో ఉన్న అన్ని సమస్యలకు ముఖ్యమంత్రుల సమావేశం శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హనుమకొండ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఆదివారం బీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉట్కూరి రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… గత పదేళ్లుగా పెండింగులో ఉన్న తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని సమావేశం కావడం హర్షనీయమని, ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన భాద్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, యువత ఉపాధికి భారీ పరిశ్రమలు లాంటి హామీలు అమలు చేయాలన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయబోమని ఎన్నికల ముందు చెప్పి నేడు టెండర్ లు పిలుస్తున్నారన్నారు. తెలంగాణాలోని సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే టెండర్ లు పిలుస్తున్నారని విమర్శించారు.

నేడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ముకుతాడు వేసేలా గట్టి ప్రతిపక్షం ఏర్పడిందని, ఇక గతంలో మాదిరిగా మోడీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు కాలం చెల్లిందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలను సమన్వయం చేసుకుని దేశంలోని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న బీజేపీ, ఎన్డీఏ ఆగడాలను అరికట్టేందుకు వామపక్ష లౌకిక శక్తులను కాంగ్రెస్ కలుపుకుపోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ అందేలా కృషి చేయాలన్నారు.

- Advertisement -

అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు కావస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాపాలన ధరఖాస్తులకు పరిష్కారం చూపాలని, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పెంచిన పింఛన్లు, పెండింగులో ఉన్న రేషన్ కార్డులను అందించాలన్నారు. రైతు భరోసాపై ముఖ్యమంత్రి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని, కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలని సూచించారు. అలాగే రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వాలన్నారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు కావస్తున్న సందర్భంగా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.

ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోసం ఆందోళనలు..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలపై గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు, ఇండ్ల స్థలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు తెలిపారు. జూలై 19న తహశీల్దారు కార్యాలయాల ఎదుట, జూన్ 26న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఆగస్టు 22, 23, 24 తేదీల్లో పార్టీ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.విజయ సారథి, నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, బీకేఎంయు జాతీయ నాయకులు మోతె లింగారెడ్డి, నాయకులు మద్దెల ఎల్లేష్, తోట బిక్షపతి, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, బాషబోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement