- తెలంగాణ పోలీసుల హెచ్చరికలు
- పార్సిల్ వచ్చిందని ఫోన్లు..
- డ్రగ్స్ ఉన్నాయని బెదిరింపులు
- కేసులు, సెక్షన్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వసూలు
- అప్రమత్తంగా ఉండాలన్న పోలీసు అధికారులు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: అమాయక జనాలను దోచుకునేందుకు కేటుగాళ్లు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పార్సిల్ వచ్చిందని ఏదో ఒక కంపెనీ నుంచి ఫోన్ చేసి.. ఆ పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని భయపెడుతున్నారు. ఆ కొద్దిసేపటికే కస్టమ్స్ అధికారులమంటూ కేటుగాళ్లు రంగంలోకి దిగి కేసులు, సెక్షన్లు అంటూ భయబ్రాంతులకు గురిచేసి పెద్ద మొత్తంలో డబ్బు వసూలుకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫేక్ పార్సిల్ స్కామ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు.
ఎక్స్ వేదికగా అలర్ట్ ట్వీట్..
ప్రముఖ కంపెనీల పేరుతో కాల్ చేసి పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరిస్తున్నారని, డబ్బు వసూలు చేస్తున్నారని, అందుకే బుక్ చేయని పార్సిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. ఈ తరహా సైబర్ నేరాలపై 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి!’’ అంటూ ఎక్స్ వేదికగా అలర్ట్ ప్రకటించారు. పార్సిల్‌లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని బెదిరిస్తే నమ్మవద్దని సూచించారు. కేసులు, సెక్షన్ల అని నమ్మించే ప్రయత్నం చేస్తారని, చివరకు డబ్బు వసూలుకు పాల్పడతారని వివరించారు.