ముధోల్, (ఆంధ్రప్రభ) : మండల కేంద్రంలోని చౌరస్తాలు, గ్రామ పొలిమేరల్లో సీసీ కెమెరాలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. దోపిడీలను అరికట్టేందుకు ప్రజలను ప్రోత్సహించి గతంలో పోలీస్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అయితే వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఫలితంగా దొంగతనాలు జరిగిన దొంగలు సులువుగా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సీసీ కెమెరాలు లేని జాతీయ రహదారి కూడలి
జాతీయ రహదారిపై ముధోల్ మండల కేంద్రంలోని నయాబాదిలోని ప్రధాన అంబేద్కర్ చౌరస్తా వద్ద సిసి కెమెరాల నిఘా లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో గల సిసి కెమెరాలను గత కొన్ని నెలల కిందట రోడ్డు విస్తరణ పనులలో భాగంగా తొలగించారు.
ప్రత్యామ్నాయంగా వీటిని మరో చోట ఏర్పాటు చేయలేదు. బస్ స్టాండ్ సమీపంలోని మహాత్మాజ్యోతిబాపులే చౌరస్తాలో మూడు స్టాండ్లు ఉన్నా రెండు కెమెరాలే ఏర్పాటు చేశారు.
పలు చోట్ల ఒకటి ఆకాశానికి చూస్తే మరొకటి భూమిని చూస్తోంది. రాత్రివేళల్లో అక్రమ మొరం రవాణా చేసే వారు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా త్వరలో సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం: ఎస్సీ కె.సంజీవ్ కుమార్.
అంబేద్కర్ చౌరస్తాలో త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎస్సై కె.సంజీవ్ కుమార్ తెలిపారు. పలు చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న ఫిర్యాదులను పరిశీలించి… పూర్తి స్థాయిలో వాటిని బాగుచేసేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు.