కోదాడ/హైదరాబాద్, ఆంధ్రప్రభ : గంజాయికి బానిసైన కన్న కొడుకుని స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లి శిక్ష విధించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగులోకి వచ్చింది. గంజాయి వాడవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఇబ్బంది పెడుతున్న కొడుకును అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చిన తల్లి సోమవారం కొడుకును ఇంటికి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లి శిక్ష విధించే ప్రయత్నం చేసింది. కోదాడ పట్టణం గాంధీనగర్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు పాఠశాలకు వెళ్లడం మానేసి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. చెడు అలవాట్లు, చెడ స్నేహం చేసి గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు. ఈ వ్యసనానికి గురైన బాలుడికి తన తల్లి ఎన్నోమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఆగ్రహానికి గురైంది. తన కుమారుడు తన కండ్ల ముందే చెడిపోతున్నాడన్న విషయం జీర్ణించుకోలేని తల్లి ఏదో ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజూ గంజాయి మత్తులో ఇంటికి వచ్చే కుమారుడికి మంచి మాటలు చెప్పి మాన్పించే ప్రయత్నం చేసింది. అయినా తల్లి మాటను పెడచెవిన పెట్టడంతో ఆగ్రహించిన తల్లి కొడుకుని స్తంభానికి కట్టేసింది. కండ్లలో కారం పోసి దేహ శుద్ధి చేసింది. మత్తు పదార్థాలు మానేస్తా అని కుమారుడు మాట ఇవ్వడంతో కన్నపేగు విడిచిపెట్టింది. కుమారుడికి చికిత్స చేయించి గుండెలకు హత్తుకుంది.
తన కొడుకు గంజాయి మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతాడేమోనన్న ఆందోళనను ఆ తల్లి అనేకమార్లు వ్యక్తం చేసినట్టు సమాచారం. గంజాయిని వాడవద్దని పదే పదే చెప్పినా.. కౌన్సెలింగ్ నిర్వహించినా.. ఫలితం లేకపోవడంతోనే తానీ కఠిన నిర్ణయం తీసుకున్నానని ఇరుగు పొరుగు వారికి చెప్పినట్టు సమాచారం. గంజాయికి బానసైన బాలుడిని తల్లి శిక్షిస్తున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్లు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి. కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు ఆ తల్లి విధించిన దండనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కొంత మంది మాత్రం బిడ్డకు నచ్చజెప్పుకోవాలేగానీ స్తంభానికి కట్టేసి కంట్లో కారం పోసి దేహ శుద్ధి చేయడమేంటని ప్రశ్నించారు.