Tuesday, November 26, 2024

TG | ఆశ్రునయనాలతో శైలజకు అంతిమ వీడ్కోలు

  • వాంకిడి మండలంలో హై టెన్షన్
  • రహదారుల దిగ్బంధం
  • సొంతూరు దాబాలో ఉద్రిక్తత
  • ఎమ్మెల్యే కోవ లక్ష్మీ హౌస్ అరెస్ట్
  • మృతదేహాన్ని కలెక్టరేట్ కు తీసుకెళ్లేందుకు విఫలయత్నం
  • ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు
  • అసిస్టెంట్ కలెక్టర్ హామీతో అంత్యక్రియలు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఆదిలాబాద్ బ్యూరో : కొమరం భీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతిచెందిన విద్యార్థిని శైలజ అంత్యక్రియలు ఉద్రిక్తతల నడుమ పూర్త‌య్యాయి. బాలిక మృతదేహాన్ని అర్ధరాత్రి సొంతూరు దాబా గ్రామానికి త‌ర‌లించారు. కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆందోళన నేప‌థ్యంలో ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ అలం, కొమరం భీం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 500మంది పోలీసు బలగాలు మొహరించాయి.

గ్రామంలోకి ఎవ‌రూ వెళ్ల‌కుండా పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆమెను గృహనిర్బంధం చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే వచ్చేంత వరకూ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని, లేకుంటే కలెక్టర్ కార్యాలయానికి మృతదేహాన్ని తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పట్టుబట్టారు.

- Advertisement -

పోలీసుల‌తో ఎమ్మెల్యే వాగ్వాదం…
గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం శైలజ అంత్యక్రియలు నిర్వహించి పేద కుటుంబానికి తీరని అన్యాయo చేస్తోందని ఆసిఫ్‌బాద్ ఎమ్మెల్యే లక్ష్మి ధ్వజమెత్తారు. పోలీసుల‌తో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహాన్ని చూసేందుకు ఎమ్మెల్యేకు అనుమతించారు. బాలికకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని హెచ్చరించారు.

అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ హామీతో…
శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ దండే విట్టల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి కొన్ని షరతులకు అంగీకరించారు. పేదింటి శైలజ కుటుంబానికి పక్కా గృహం, రూ.2 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని అసిస్టెంట్ కలెక్టర్ దీపక్ తివారి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి రెండు ఎకరాల భూమి కూడా ఇచ్చేలా చూస్తామని భరోసా కల్పించారు. దీంతో ఆందోళన విరమించి మధ్యాహ్నం కన్నీటి వీడ్కోల తో శైలజ అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement