సంగారెడ్డి, జనవరి 12 (ఆంధ్రప్రభ) : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త అల్లుడికి 108రకాల వంటలతో విందును ఇచ్చారు. సంగారెడ్డిలోని శాంతినగర్ లో ఈ విందు కార్యక్రమం జరిగింది. పసల్ వాది మాజీ సర్పంచ్ మంగ రాములు నివాసంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల మంగరాములు రెండవ కుమార్తె డాక్టర్ నిషా వివాహాన్ని డాక్టర్ శ్రీకాంత్ రాయితో నిర్వహించారు.
అదేవిధంగా సినీ నటుడు ఏడిద రాజా కుమార్తె మేఘన వివాహాన్ని లక్ష్మణ్ యాదవ్ తో జరిపారు. ఈ రెండు కొత్త జంటలకు కొత్త జంటలను విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా 108 వంటకాలను తయారుచేసి వారికి వడ్డించారు. ఆత్మీయుల ఆనందోత్సాహాల మధ్య ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహించడంతో కొత్త అల్లుళ్లు సంబరపడ్డారు.
ఏడిద రాజా కృష్ణవేణి దంపతులతో పాటు నాగ శంకర్ పద్మ దంపతులు, శంకర్రావు సీతామహాలక్ష్మి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాను రాను సంప్రదాయాలు కనుమరుగవుతున్న సమయంలో ఇలాంటి విందును ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.