హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా సీఎంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతామని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ట్విట్ చేశారు.
అలాగే మంచిర్యాల బీఆర్ఎస్ ప్రెసిడెంట్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నమోదైన కేసుపై స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందని విమర్శించారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండని హితవు పలికారు.