జగిత్యాల : బైక్ ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతులను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతులను రామయ్యపల్లె గ్రామానికి చెందిన కూస చంద్రయ్య(60), కూస భాగ్యమ్మ(55) గా పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి ధర్మపురి చర్చిలో ప్రార్థనల నిమిత్తం దంపతులిద్దరూ వెళ్లారు. ప్రార్థనల అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జాతీయ రహదారిపై వారి బైక్‌ను కారు ఢీకొట్టింది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.