వీధి కుక్కల నియంత్రణలో అధికారులు విఫలం
ప్రాణాలు పోతున్నా చర్యలు శూన్యం
పఠాన్ చెరు, ప్రభ న్యూస్ : పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మహిదార్ వెంచర్ లో విషాదం నెలకొంది. శుక్రవారం వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే… బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కుటుంబం బ్రతుకుదెరువు నిమిత్తం ఇస్నాపూర్ కు వచ్చి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని వీధి కుక్కలు ఇంటి వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై అతి ఘోరంగా దాడి చేసి చంపేశాయి.
రక్తపు మడుగులో బాలుడు తల్లిదండ్రుల ముందే కుప్పకూలిపోయాడు. నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూస్తూ తల్లిదండ్రులు హతాషులయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వీధి కుక్కలను అరికట్టడంలో గ్రామపంచాయతీ అధికారులు విఫలమయ్యారని వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
మరో దాడిలో 7 నెలల బాలిక తీవ్ర గాయాలు
నీలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలిక..
పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామంలో జరిగిన మరో ఘటనలో వీధి కుక్కలు ఏడు నెలల పసికందు బాలికను తీవ్రంగా గాయపరిచాయి. వీధి కుక్కలపై నియంత్రణ లేకపోవడంతో చిన్నపిల్లలపై దాడి చేసి చంపేస్తున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధిత కుటుంబాల శోకాన్ని చూస్తున్నారే తప్ప.. చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని, వీధి కుక్కలను తక్షణమే నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.