Friday, November 22, 2024

TS: సమైక్య పాలనలో నల్లబడ్డ ముఖం… స్వరాష్ట్రంలో తెల్లగయ్యింది.. గంగుల

సమైక్య పాలనలో నల్లబడ్డ తెలంగాణ ముఖం స్వరాష్ట్రంలో తెల్ల ముఖం అయ్యిందని, పచ్చని తెలంగాణను దోచుకునేందుకు ఆంధ్రోళ్ళు… కడుపు నిండా విషం పెట్టుకుని… విషపాములై వచ్చారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, బహదూర్ ఖాన్ పేటలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలుకగా మంత్రి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… 2009 ఎన్నికలకు ముందు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న చామన్ పల్లి… 2009 ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో కలిసిందని.. ఆనాడు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లు, తాగునీరు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.

కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు పొలాల వద్ద పడిగాపులు కాసి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన రోజులుండేవన్నారు. కానీ పదేళ్ల స్వయంపాలనలో కోట్లాది రూపాయలతో పల్లెలు అభివృద్ధి చేశామని తెలిపారు. కాళేశ్వరం నీటితో పల్లెలు సస్యశ్యామలం అయ్యాయన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని బీజేపీ ముసుగులో కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన ముసుగులో పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ముసుగులో షర్మిల… కేవీపీలు హైదరాబాద్ లో అడ్డా వేశారన్నారు. కేసీఆర్ ను ఓడించి తెలంగాణ సంపదను దోచుకెళ్లాలని చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అన్నారు.

- Advertisement -

ఆంధ్రోళ్లు చెప్పినట్టే కాంగ్రెస్, బీజేపీలు వింటాయి… వారికి అధికారం కట్టబెడితే మరోసారి దోచుకుని గుడ్డిదీపం చేస్తారని తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టొద్దు… ఆగం చేయొద్దు అని కోరారు. ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తున్నారని.. కాంగ్రెస్ అభ్యర్థిగా భూములను కబ్జా చేసే దొంగ వస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటే… ఆయన 5 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నాడని కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అని.. ఆయనపై 30కి పైగా కేసులున్నాయని.. ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే మన భూములను కబ్జా చేస్తాడని మనల్ని బతుకనివ్వరని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడైనా కనిపించాడా… మన కష్టాలు పట్టించుకున్నాడా అని అడిగారు. ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి కోసం రూపాయి తేలేదని తాను మాత్రం మీ బిడ్డగా మీ మధ్యే ఉన్నానని గుర్తు చేశారు. విలువైన ఓటు వృధా చేయొద్దని… దొంగలకు ఓటు వేయొద్దని… మచ్చలేని మీ బిడ్డను ఆశీర్వదించలని కోరారు. ఓటు వేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించాలని.. నన్ను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.. ఎవరు మంచోడు… ఎవరు దొంగో గ్రామాల్లో చర్చ జరగాలని, అభివృద్ధికి ఓటు వేసి కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement