Saturday, November 23, 2024

ఈ నెల 9లేదా 10న – హైద‌రాబాద్ కి నైరుతి రుతుప‌వ‌నాలు

ఈ నెల 9లేదా 10న తెలంగాణ‌లో నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌వ‌చ్చ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. గత ఏడాది జూన్‌ 6న రాష్ట్రంలోకి వచ్చిన రుతుపవనాలు 9 నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి రుతుపవనాల రాక 3-4 రోజులు ఆలస్యమైనప్పటికీ ఇది సాధారణ సమయమేనని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి చెప్పారు.ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా మంగళవారం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 45.8 డిగ్రీలు, కరీంనగర్‌ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ నెల 9 వరకు సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఆ తర్వాత 11 వరకు సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ లోగా రైతులు దుక్కులు సిద్ధం చేసుకోవాలని, రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాకే విత్తనాలు వేసుకోవాలని శ్రావణి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement