Monday, November 25, 2024

15న కెసిఆర్ చేతుల మీదుగా తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రారంభం

హైదరాబాద్ ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. . ఈ ఏడాది ప్రారంభం అవుతున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లుగా, ఈ ఈనెల 15న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement