Tuesday, November 26, 2024

యువతరం ఎటు?.. మునుగోడులో తొలిసారి ఓటేయనున్న 8,432 మంది యువత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశమంతా ఆశక్తితో గమనిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరి పోలింగ్‌కు చేరువైంది. నవంబర్‌ 3న జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్‌లో ఎంత ఎక్కువ శాతం ఓటింగ్‌ నమోదైతే అంత లాభమనే కోణంలో ఎవరికి వారుగా పార్టీలు, అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉండగా, ఓటర్లు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,855 మందికాగా, ఇందులో పురుష ఓటర్లు 1,21,662 మంది, మహిళా ఓటర్లు 1,20,126 మంది, థర్డ్‌ జెండర్‌ 7 ఓట్లు ఉన్నాయి. ఎన్నారై ఓటర్లు పురుషులు 10 మంది ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో 48మంది పురుష సర్వీస్‌ ఓటర్లు, ఇద్దరు మహిళా సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. వీరు నవంబర్‌ 3న నేతల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. కాగా కులాల వారీగా తీవ్ర చర్చకు నిలయంగా మారిన మునుగోడులో 80ఏళ్లకు పైబడిన సీనియర్‌ ఓటర్లు 2576, దివ్యాంగ ఓటర్లు 5686 మంది ఉన్నారు. 18నుంచి 19ఏళ్ల మధ్య వయసులోని నూతన ఓటర్లు 8432 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక 20నుంచి 21ఏళ్ల నడుమ వయసున్న ఓటర్లు 8472 మంది, 22నుంచి 25ఏళ్ల మధ్యలో 20,472 మంది ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది.

ఇక 31నుంచి 40ఏళ్ల మధ్య వయస్కు ఓటర్లు 64,721 మంది, 41నుంచి 50ఏళ్ల మధ్య వయసులోని 47,430మంది ఓటర్లు నేతల తలరాతలను మార్చేందుకు నియోజక వర్గంలో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక 51నుంచి 60ఏళ్ల మధ్యలో 32,120మంది, 61నుంచి 70ఏళ్ల మధ్యలో 19,655మంది, 71నుంచి 80ఏళ్ల నడుమ 9723 మంది ఓటర్లున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో 35 పోలింగ్‌ కేంద్రాలుండగా, రూరల్‌ ఏరియాల్లో 263 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మునుగోడు ఎన్నికలు మొదటి నుంచీ అత్యంత హీట్‌ను రేకెత్తించి ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టగా తీసుకొని ప్రచారం చేశాయి. ఈ ఎన్నికల ప్రచారంలో జాతీయస్థాయి అంశాలతోపాటు, రాష్ట్ర సమస్యలు, హామీలను అన్ని పార్టీలు ప్రజలకు గుర్తుచేస్తూ ముందుకుసాగాయి.

ఇక సోషల్‌ మీడియాలోనూ ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీలు జోరుగా ముందుకు సాగాయి. ప్రచారాన్ని ప్రతి క్షణం సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేసి అన్ని వయసుల వారికి చేరేలా, వారిని ఆకర్శించేలా చర్యలు తీసుకున్నారు. అన్ని వయసుల వారి ఆదరణ పొందేలా పార్టీలన్ని పక్కా ప్రణాళికలతో ప్రచారం పూర్తి చేశాయి. ఇక ఏజ్‌ గ్రూపుల వారీగా ఓటర్లు పార్టీల ప్రచారంతో ఎంత మేర ప్రభావితమయ్యారో ఈనెల 3న జరిగే పోలింగ్‌ తర్వాతే వెల్లడి కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement