బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల వేళ బింగ్ బాంబ్ పేల్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని జరుగుతోన్న ప్రచారమంతా కేసీఆర్ ఆడుతోన్న నాటకమని కొట్టి పారేశారు. సాక్ష్యాత్తు ప్రధాని మోడీనే బీఆర్ఎస్ నేతల అవినీతిపై విమర్శలు చేశారని.. అటువంటి వారితో మళ్లీ పొత్తు ఎలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకొలేదు.. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటామన్నారు. తెలంగాణలో 17కి 17 ఎంపీ సీట్లు బీజేపీనే గెలుస్తోందని దీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని బండి జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశమే లేదన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు లేరని.. ఉన్నవాళ్లు కూడా పక్కచూపులు చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బ్రతిమిలాడుతున్నాడని అన్నారు.