హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎన్నికల నగదు, మద్యం, బంగారం భారీగా పట్టుబడుతోంది. 10 రోజులు గడువకముందే రూ. 100కోట్లకు చేరువవుతోంది. అన్ని రకాలుగా పోలీస్ శాఖ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఇతరాల విలువ రూ. 74.95కోట్లకు చేరుకుంది. ఒకట్రెండు రోజుల్లో ఇది రూ. 100కోట్లను మించనుందని అంచనా వేస్తున్నారు.
ఇందులో రూ. 48.32కోట్ల నగదు పట్టుబడగా, మత్తుపదార్ధాల విలువ రూ. 4.72కోట్లుగా నమోదైంది. రూ. 30కోట్ల విలువైన మద్యం పట్టుబడగా, 37.4 కిలోల బంగారం, 365 కిలోల వెండి, 42.20 క్యారెట్ల వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 17.50కోట్లుగా ఉన్నది. కుట్టుమిషన్లు 80కిలోలు, 43700 కిలోల బియ్యం, 87 కుక్కర్లు, 627 చీరెలు, రెండు కార్లు, 59 గడియారాలు, 55 హెల్మెట్లు తదితరాలను సీజ్ చేశారు.