హైదరాబాద్ : ఎంబీబీఎస్ చదవాలనుకునే సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరిగింది.
నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్, ఈ మేరకు వారి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు సింగరేణి ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.