హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ వద్ద రూ.6.5కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఆరు కార్లలో డబ్బును తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. అయితే ఈ నగదు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేతకు చెందినవిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోంది. అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు, బంగారం, ఇతరత్రా భారీగా పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఆరు కార్లలో సూట్ కేసుల్లో తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం రూ.6.5 కోట్లుగా వుంటుందని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వ్యక్తిదిగా అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఈ డబ్బు తరలిస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.