Friday, November 22, 2024

అందుబాటులో 500 టన్నుల ఆక్సిజన్ …

హైదరాబాద్‌, : ప్రస్తుత సెకండ్‌ వేవ్‌లో కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగి ఆక్సిజన్‌ డిమాండ్‌ ఎక్కువవడంతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ ప్రాణ వాయువుకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా సమకూర్చుకోవడమే కాకుండా దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా సొంత ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 100 టన్నుల దాకా ఆక్సిజన్‌ ఉత్పత్తవుతోంది. దీనిని 10 నుంచి 15 రోజుల్లో 200 టన్నుల వరకు పెంచుకునే దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. త్వరలో పెరగనున్న సొంత ఉత్పత్తి సామర్థ్యం, కర్ణాటకలోని బళ్లారి, ఒడిశాలోని అంగుల్‌ నుంచి ఆక్సిజన్‌ రైలు, రోడ్డు వాయు మార్గాల ద్వారా వస్తోంది. సొంతగా ఉత్పత్తయ్యేది, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసే ఆక్సిజన్‌ కలుపుకుంటే రానున్న రోజుల్లో 500 టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోజుకు 300 టన్నుల దాకా ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు అందుబాటులో ఉంచుతున్నారు. సెకండ్‌ వేవ్‌ కేసుల తీవ్రత, థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న అంచనాల మధ్య అందుబాటులో ఉండే ఆక్సిజన్‌ మొత్తాన్ని పెంచుకోవాల్సిందేనని వైద్యారోగ్య శాఖాధికారులు నివేదిక ఇచ్చినందునే ప్రభుత్వం సొంత సామర్థ్యం పెంపు వైపు కూడా దృష్టి పెట్టాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. సొంతగా ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంపు యత్నాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో మూతపడిన ఆక్సిజన్‌ ప్లాంటు, భద్రాచలంలో మూతపడిన ఐటీసీ ఆక్సిజన్‌ ప్లాంటును తెరిపించడానికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రోజుకు 80 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ రెండు ప్లాంట్లు త్వరలోనే రాష్ట్రంలోని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం దాదాపుగా ఖాయమైంది. ఇక్కడ ఉత్పత్తి కాబోయే ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికిగాను క్రయోజెనిక్‌ ట్యాంకర్లను కూడా ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల నుంచి సీఎస్‌ఆర్‌ పద్ధతిలో సమకూర్చుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై పేరొందిన కాంట్రాక్టు సంస్థ మేఘా స్పెయిన్‌ నుంచి ట్యాంకర్ల దిగుమతికి ఆర్డర్‌ కూడా ఇచ్చింది. ఇంతేగాక ఇటీవల పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన క్రమంలో రాష్ట్రంలో 50 ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మించనున్నారు. ఇప్పటికే పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి మంజూరైన నిధులతో గచ్చిబౌలిలోని టిమ్స్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటును అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో పీం కేర్స్‌ నిధులతో రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో గాలి నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ప్రారంభం కానున్నాయి. పీఎం కేర్‌ నిధుల నుంచి రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్ల ద్వారా 1500 పడకలకు ప్రాణవాయువు సౌకర్యం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం కేర్‌ నిధుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆస్ప త్రుల్లో గాలి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్లాంట్‌ల నిర్మాణా నికిగాను ప్రభుత్వం డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్డీఓ) నుంచి సాంకేతిక సహకారం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆక్సిజన్‌ కావల్సినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉండడం కోసం అవసరమైన మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement