Tuesday, November 26, 2024

TG | గత ప్రభుత్వ అవినీతితో రూ.50వేల కోట్ల బకాయిలు : మంత్రి తుమ్మ‌ల

  • సివిల్ సప్లై శాఖలో కొనసాగుతున్న కష్టాలు
  • ధాన్యం కొనుగోళ్లు స‌జావుగా సాగుతున్నాయి
  • రాహుల్, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తున్నాం
  • విప‌క్షాలు రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నాయి
  • ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల‌ని ప‌రిశీలించిన మంత్రి తుమ్మ‌ల


నల్గొండ – గత ప్రభుత్వ అసమర్ధత, అవినీతి వల్ల రూ.50వేల కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని తెలిపారు. నల్లగొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహ‌కులను మంత్రులు ప్రశంసించారు. అనంతరం జిల్లా కేంద్రంలో దిశ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి ఎంపీలు, ఎంఎల్ఎలు, అధికారులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల మాట్లాడుతూ… అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా పని చెయ్యాలన్నారు. సన్నాల సాగుపై గత ప్రభుత్వానికి నిర్దిష్ట లక్ష్యం లేదని తెలిపారు. అన్నిరంగాల్లో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. అధికారం కోల్పోయి కొంతమంది.. అధికారం కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement