దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ది
అచ్చంపేట జులై 5, ప్రభ న్యూస్ : మహిమాన్వితమైన, పురాతనమైన, శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ది గాంచిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ది చేస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం నల్లమల్ల పర్యాటక అభివృద్ది అధ్యయన పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ ఇంచార్జి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మా, అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లాలోని ఇతర ఎమ్మేల్యేలతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… ఉమామహేశ్వర క్షేత్రం అత్యంత పురాతనమైన, ప్రసిద్దిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రమన్నారు. 50లక్షల రూపాయలతో ఆలయం ముందు భాగాన్ని విస్తరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థమై ముఖ్యమైన అభివృద్ది పనులు చేపట్టబోతున్నామన్నారు. అంతకు ముందు మంత్రి దామోదర రాజనర్సింహ్మా, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో పాటు ఇతర ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రంగనాథ్‌లు పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలుకగా, ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలుకగా సాంప్రదాయ దుస్తులతో ఉమమహేశ్వర సన్నిధిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలీ దర్గాలో చద్దరు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్టర్ రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళిఖేరి, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇల త్రిపాఠి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి, ఇతర జిల్లా అధికారులతో పాటు డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రేసు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.