Friday, November 22, 2024

TS: కేసీఆర్ ప్ర‌చారంపై 48గంట‌ల నిషేధం… మండిప‌డ్డ మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

ఇది మోదీ, రేవంత్ ల కుట్ర‌గా అభివ‌ర్ణ‌న‌
ఆరు బ‌స్సుయాత్ర‌లతోనే బీజేపీ, కాంగ్రెస్ ల‌లో వ‌ణుకు
మోదీ, రేవంత్ విద్వేష ప్ర‌సంగాల‌పై చ‌ర్య‌లేవి..

సూర్యాపేట : బ‌ఈఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమేనని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నిక‌ల సంఘం గులాబీ బాస్ పై గ‌త రాత్రి 8 గంట‌ల నుంచి 48 గంట‌ల పాటు ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించింది.. దీనిపై జ‌గ‌దీష్ రెడ్డి సూర్యాపేట‌లో స్పందిస్తూ, మోడీ మత విద్వేషాలు, సీఎం రేవంత్ విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోడీకి వణుకుడు మొదలైంద‌న్నారు.

ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ల కింద భూమి కంపిస్తుంద‌న్నారు. ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుందన్నారు. రేవంత్ ఢిల్లీ మూటలపై సమాచారం ఉంటే మోదీ ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. రేవంత్ అవినీతి తెలిసినా మోదీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి? కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారి పట్టించడం కోసమే డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ప్రజల్లో చర్చ మొదలైంది. ఎన్ని నిషేధాలు పెట్టినా బీఆర్‌ఎస్ విజయాన్ని అడ్డుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement