317 జీవో వల్ల అన్యాయం జరిగిందని, తమ బ్యాచ్ కు చెందిన కొంతమంది ఎస్సై లకు మూడేళ్ల కిందట పదోన్నతి కల్పించారని, తమకు కూడా పదోన్నతులు కల్పించాలని 2012 బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సీతక్క కు విన్నవించారు. మంత్రిని కలిసి 317 జీవో వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని వివరించారు. 2012 బ్యాచ్ లో వరంగల్ జోన్ నుండి 146 మంది ఎస్ఐ లుగా ఎంపికయ్యామని, తమ బ్యాచ్ కు చెందిన 46 మందికి మూడేళ్ల కిందట పదోన్నతి లభించిందని వివరించారు.
ఒకే బ్యాచ్ లో ఎంపికైన తమకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. పాత సీనియార్టీ ప్రకారం తమకు ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ పదోన్నతి కల్పించాలని, తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. పోలీస్ శాఖలో ఒక స్థాయిలో ఆరు సంవత్సరాలు పనిచేస్తే పై స్థాయి పదోన్నతికి అర్హులవుతారని 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా తమకు పదోన్నతులు రాలేదని వాపోయారు. సమస్య మంత్రి సానుకూలంగా స్పందించారని, 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెల్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎస్సైలు పేర్కొన్నారు.