హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతుల నుంచి కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్‌కోసం కేటాయిస్తున్న ధాన్యం రైసు మిల్లర్లకు కల్పతరువుగా మారింది. కేటాయిం చిన ధాన్యాన్ని మరాడించి ఎఫ్‌సీఐకి కేటాయించాల్సిన మిల్లర్లు అక్రమంగా బహిరంగ మార్కెట్‌లో రూ.30 కి కిలో చొప్పున బియ్యాన్ని అమ్ముకుని డబ్బులు దండుకుంటు న్నారు. ఫలితంగా రాష్ట్రంలోని రైసు మిల్లర్లు పెద్ద సంఖ్యలో సీఎంఆర్ అప్పగింతలో జీరో డిఫాల్టర్లుగా తేలారు. రాష్ట్రంలో దాదాపు 3వేల రైసు మిల్లులు ఉండగా అం దులో 10శాతం అంటే దాదాపు 300దాకా మిల్లులు కిలో సీఎంఆర్ బియ్యాన్ని కూడా అప్పటించలేదంటే మిల్లర్ల ఆగడాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మిగతా 2500 రైసు మిల్లులు కూడా పెద్ద మొత్తంలో ఎఫ్‌సీఐకి, సివిల్ సప్లై కార్పోరేషన్‌కు సీఎంఆర్ బాకీపడినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లింగ్ (బియ్యంగా మార్చే ప్రక్రియ) కోసం రైసు మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు ఆ వడ్లను మరాడించి క్వింటా వడ్లకు 68కిలోల చొప్పున కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తిరిగి ఇవ్వాలి. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు మిల్లింగ్ ఛార్జీలు చెల్లిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ఖరీఫ్‌లో దాదాపు 90లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. నిర్ణీత సమయంలో మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి సీఎంఆర్‌ను అప్పగించాల్సి ఉన్నా మిల్లర్లు తేడాగా వ్యవహరించడంతో ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కేటాయింపు లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక పేచీలు పెడుతోంది. ఈ వ్యవహారా నికంతటికీ కారణం రైసు మిల్లర్లు సీఎంఆర్ కోసం ప్రభుత్వం కేటాయించిన వడ్లను బహిరంగ మార్కెట్‌లో అక్రమంగా అమ్ముకోవడమేనన్న విమర్శలు ఉన్నాయి.
మిల్లర్ల తీరుపై సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్‌సింగ్ అధికారులపై పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 2021-22 ఏడాది రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం తాలూకు సీఎంఆరే దాదాపు 12.61లక్ష ల టన్నుల మేర మిల్లర్లు బకాయిపడ్డారు. దీనికి తోడు ఈ ఏడాది ఖరీఫ్ తాలూకు సీఎంఆర్ బాకీ దాదాపు 10లక్షల టన్నులుగా తేలింది. ఈ పరిస్థితుల్లో గడువులోపు సీఎంఆర్ అందించకపో వడంతో అనుమానం వచ్చిన పౌరసరఫరాల శాఖ అధికా రులు రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మిల్లర్లు వడ్లను మిల్లింగ్ చేసి ఓపెన్ మార్కెట్‌లో కిలో కు రూ.30కి అమ్ముకున్నట్లు తేలింది. మరికొందరు ఏకంగా వడ్లనే అమ్మేసుకుంటున్న విషయం బయటపడింది. ప్రభు త్వం పీడీఎస్ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని డీలర్లు, దళారుల వద్ద కిలో రూ.10కి కొనుగోలు చేసి వాటినే పాలిష్ చేసి సీఎంఆర్‌కు పెడుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ పరిస్థితుల్లో గడువులోగా సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లులకు ఈ ఏడాది యాసంగిలో ధాన్యం కేటాయింపు జరిపేది లేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమీక్షలో ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మిల్లర్లకు తేల్చి చెప్పారు. ఏప్రిల్ మాసాంతానికి గతేడాది రబీకి సంబంధించిన సీఎంఆర్ బకాయిని మిల్లర్లు అప్పజెప్పాలని అల్టిdమేటం కూడా జారీ చేశారు. ఈ ఏడాది 2022-23 రబీలో గతంలోని సీఎంఆర్ బకాయిని అప్ప గించిన రైసు మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు జరపాలని నిర్ణయించారు.