Wednesday, November 27, 2024

భారత్‌కు 30 మంది తెలంగాణ విద్యార్థులు.. ఢిల్లీ తెలంగాణ భవన్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందినవారిని గుర్తించి, వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రొమేనియా నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో దాదాపు 30 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులున్నట్టు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ గుర్తించింది. విదేశీ వ్యవహారాల శాఖతో పాటు చిక్కుకున్న విద్యార్థులు, తెలంగాణలోని వారి తల్లిదండ్రులతో అనునిత్యం సంప్రదింపులు జరుపుతున్న కంట్రోల్ రూమ్ సిబ్బంది, చిక్కుకున్న విద్యార్థుల సమాచారాన్ని క్రోడీకరిస్తోంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 200 మందికి పైగా ఫోన్ చేశారని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం 700 – 800 మందికి పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులున్నట్టు తెలిసిందని అన్నారు. వారందరినీ భారత్ చేర్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ సిబ్బందితో పాటు హంగేరి, పోలాండ్, రొమేనియా, స్లోవక్ రిపబ్లిక్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతీ తెలంగాణ విద్యార్థిని వెనక్కు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని గౌరవ్ ఉప్పల్ తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దని, ఢిల్లీకి చేరుకునే విద్యార్థుల సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందని, వారిలో తెలంగాణ వారిని గుర్తించి వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement