డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంత మంది మాత్రం మారడం లేదు. తాజాగా డ్రండ్ అండ్ డ్రైవ్ లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పీఎస్ పరిధి బౌరంపేటలో జరిగింది.
శనివారం అర్ధరాత్రి బౌరంపేటలో ఉన్న కోకాకోల కంపెనీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకుడిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని విజవాడకు చెందిన చరణ్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన సంజూ, గణేశ్‌గా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నలుగురు యువకులు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును చరణ్ నడుపుతున్నాడని చెప్పారు. గాయపడిన అశోక్(ఏలూరు) పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.