హైదరాబాద్ – బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందన్న ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలిపారు.
ఈ నెల 25న తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని కోరారు.
ఈ నెల 27న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 27న తెలంగాణ భవన్లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఆ రోజు ఉదయం కేసీఆర్ పార్టీ జెండాను ఎగుర వేసి, సమావేశాన్ని ప్రారంభిస్తారన్నారు. సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ, విస్తృత స్థాయి సమావేశం బదులు అక్టోబర్ 10న భారత రాష్ట్ర సమితి వరంగల్ మహాసభను నిర్వహించనున్నట్లు తెలిపారు.