Friday, November 22, 2024

240 టీఎంసీలు కావాలే.. కృష్ణా జలాలపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ సూచన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్‌ ప్లాన్‌ మొదలైంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ గురువారం భేటీ అయింది. ఈ వర్చువల్‌ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్‌ శాఖ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు యాసం గిలో సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. సమావేశంలో కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.. 15 రోజుల్లో ముగిసే ఖరీఫ్‌ పంట కోసం కాకుండా.. రాబోయే యాసంగి సీజన్‌ కోసం చర్చించాలని తెలంగాణ సూచించింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ ప్రతిపాదనకు ఏపీ సుముఖత వ్యక్తంచేసింది.

యాసంగి సీజన్‌కు సాగునీటి కోసం 150 టీఎంసీలు.. తాగునీటి కోసం 90 టీఎంసీల అవసరమవుతాయని తెలంగాణ పేర్కొంది. ఖరీఫ్‌ 15 రోజుల సీజన్‌ కోసం 23 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. త్వరలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని కేఆర్‌ఎంబీ తెలిపింది. ఇదిలా ఉండగా ఖరీఫ్‌లో ఈనెల 15వ తేదీదాకా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద 11.77 టీఎంసీలు, కుడికాలువ కింద 2.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 5.22 టీఎంసీలు, హంద్రినీవా సుజల స్రవంతి కోసం 4.14 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి కేటాయించాలని కోరుతూ కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ రాశారు. ఈ భేటీలో తెలంగాణ సైతం ఏ మేరకు నీళ్లు కావాలో వివరాలు అందించింది. సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చించిన కమిటీ తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. గతంలో ఏపీకి 207 టీఎంసీలను కేటాయించగా, ఇందులో నవంబర్‌ 30 వరకు ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 183.32 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నా మని ఏపీ తన ఇండెంట్‌లో వెల్లడించింది. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో అదనంగా 32.16 టీఎంసీలు తీసుకున్నామని తెలిపింది.

నీటిలభ్యత ఆధారంగా కేటాయింపులు
ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. విద్యుత్‌ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకో నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement