6.22 కోట్ల మీటర్ల వస్త్రం
ఆర్డర్లు ఖరారు చేసిన టీపీటీడీసీఎల్
సిరిసిల్ల: రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ పండుగ కానుక చీరల రంగులను, డిజైన్లను తెలంగాణ పవర్‌లూమ్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ఖరారు చేసింది. 21 రంగుల్లో 25 డిజైన్లలో బతుక మ్మ చీరలను ఆర్డర్ చేసింది. రాష్ట్రంలోని కోటి మందికి బతుకమ్మ పండగ కానుకగా ప్రభుత్వం చీరలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ పండుగకు చీరలను సారెగా అందిస్తున్నారు. గతంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెక్సో) ద్వారా ఈ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. ఈసారి తెలంగాణ పవర్‌లూమ్, టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ద్వారా ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లలోని 139 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్)లకు 3.70 కోట్ల మీటర్ల బట్టను (64.03 లక్షల చీరలు), 126 చిన్న తరహా పరిశ్రమల (ఎస్‌ఎస్‌ఐ)కు 1.84 కోట్ల మీటర్ల బట్టను (31.87 లక్షల చీరలు) ఆర్డర్లు ఇచ్చారు.జాకెట్ పీసుల కోసం మరో 68 లక్షల మీటర్ల బట్టను సిరిసిల్ల శివారు టెక్స్‌టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలకు ఇచ్చారు. మొత్తంగా 6.22 కోట్ల మీటర్ల బట్టను బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఏడాది నిర్ణయించారు. చీరలకు ఉత్పత్తి రవాణా, ప్రాసెసింగ్ ఇతర ఖర్చులకు మొత్తం రూ.330 కోట్లు కేటాయించారు. సెపె్టంబరు నెలాఖరులోగా ఈ చీరలను సిరిసిల్ల నేతన్నలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
మగ్గాల సంఖ్య ఆధారంగా ఆర్డర్లు ఇస్తాం
సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాము. 21 రంగుల్లో 25 డిజైన్లలో చీరలను ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశాము. మ్యాక్స్ సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లలోని మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తిదారులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తాం. గడువులోగా చీరలను ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంటుంది.