Wednesday, November 20, 2024

Followup : 22.94 కోట్లతో 296 డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం – మంత్రి శ్రీనివాస్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌, (ప్రభన్యూస్‌) : రాష్ట్రంలోని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని రసూల్‌పుర డివిజన్‌, నారాయణ జొంపిడి కాలనీకి చెందిన నిరుపేదల కోసం రూ.22.94 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 296 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి హోంమంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ, కంటోన్మెంట్‌ ఎ మ్మెల్యే జీ.సాయన్న, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌తో కలిసి మంత్రి తలసాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల పక్షపాతి అని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణాలో అమలు జరుగుతున్నాయని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు ఏడాదిలోపు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్లు పూర్తయిన తర్వాత జొంపిడి కాలనీ కాదని నారాయణ డిగ్నిటీ కాలనీ అవుతుందని ఘంటాపథంగా తెలిపారు. కంటోన్మెంట్‌ ఏరియాలో గత ప్రభుత్వాల కాలంలో ప్రజలు తాగునీరు, విద్యుత్‌, కనీస వసతుల కల్పన కరవై ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎమ్మెల్యే సాయన్న కృషి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటోన్మెంట్‌ ప్రజలకు తాగునీటి వసతి కల్పించడంతో పాటు ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

డబుల్‌ బెడ్‌ ఇళ్ల పై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు నయాపైసా ఇవ్వనవసరంలేదన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయనున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వసతులు కల్పించనున్నట్లు మంత్రి వివరించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. రాష్ట్రంలో షాదీ ముబారక్‌, కళ్యాణలక్ష్మి ద్వారా సుమారు 10లక్షలకు పైగా మంజూరు చేయగా అందులో 2.12 లక్షలమందికి పైగా షాది ముబారక్‌ పంపిణీ చేసినట్లు తెలిపారు. నగరంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఒక లక్ష గృహాలు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ 296 కుటుంబాలకు 23కోట్ల వ్యయంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో వీలైనంత త్వరగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఎవరూ నయా పైసా చెల్లించకుండా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ సమావేశంలో బేవరేజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement