తెలంగాణలో 2025 నాటికి పూర్తి స్థాయిలో క్షయ వ్యాధి (టిబి) నిర్మూలనే లక్ష్యంగా నిర్ధేశించుకుని టిబి పరీక్షలు, వైద్యం వేగవంతం చేస్తున్నట్లు తెలంగాణ టిబి విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎ. రాజేశం వెల్లడించారు. ప్రతి ఒక లక్ష జనాభాకు ఏడాదికి 198 టిబి కేసులు నమోదు అవుతుండగా ఈ సంఖ్యను 2025 నాటికి 43 కి తగ్గించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా టిబి పరీక్షల సంఖ్య భారీగా పెంచడంతోపాటు వైద్య సహాయం తక్షణమే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, కార్పొరేటు, ఎన్‌జిఒ, మీడియాతోపాటు టిబి నుంచి కోలుకున్న టిబి ఛాంపియన్ లను భాగస్వామ్యం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24న అంతర్జాతీయ టిబి దినోత్సవం పురస్కరించుకొని పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) భాగస్వామ్యంతో తెలంగాణ టిబి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘టిబి నిర్మూలన, జాగ్రత్తలు – మీడియా పాత్ర’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. పిఐబి డైరెక్టర్ శృతిపాటిల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎ. రాజేశం తోపాటు తెలంగాణ టిబి కేంద్రం సాంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ సి.సుమలత పాల్గొన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన కాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లియక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టింగ్ (CBNAAT) యంత్రాలను తెలంగాణలో నారాయణపేట జిల్లా మినహా అన్ని జిల్లా కేంద్రాలలో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో CBNAAT మెషీన్లు 8 ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలో గంటలోనే పరీక్ష ఫలితంతోపాటు టిబి తీవ్రత స్థాయిని గుర్తించవచ్చని తెలిపారు. వీటితోపాటు ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ట్రూనాట్ (TrueNAAT) పరీక్ష యంత్రాలను ఇప్పటికే 90 ఏర్పాటుచేయగా, వచ్చే మే నెలాఖరు నాటికి మరో 50 ట్రూనాట్ పరీక్ష పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిని అపెక్స్ టిబి ఆసుపత్రిగా గుర్తించడంతోపాటు మల్టీ డ్రగ్ థెరపీ, డ్రగ్ రెసిస్టెన్స్ టిబి చికిత్స పొందేవారి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిబి వ్యాధి గ్రస్తులు ఎవరైనా సహాయం కోసం 1800 116666 హెల్ప్ లైన్ నెంబరులో సంప్రదించవచ్చని ప్రకటించారు.