Friday, November 22, 2024

మ‌ద్యం షాపు న‌డ‌వాలంటే 2 లక్షల లంచం డిమాండ్​.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ

ఒక‌రి నుంచి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. నాగార్జున సాగర్‌ హిల్ కాలనీకి చెందిన నూకల విద్యాసాగర్ రెడ్డికి అతని భార్య సునీత పేరుమీద లాటరీ పద్ధతిలో తిరుమలగిరి సాగర్ మండలంలో వైన్ షాప్ వచ్చింది. అప్పటి నుంచి వైన్ షాపు సక్రమంగా నడవాలంటే నెలకు 25 వేల రూపాయలు ఇవ్వాలని హాలియా ఎక్సైజ్‌ సీఐ యమునాధర్ రావు డిమాండ్‌ చేశాడు.

మొత్తం 8 నెలలకు గాను 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి విద్యాసాగర్ రెడ్డి ఒప్పుకున్నాడు. దీంతో చేసేదిలేక విద్యాసాగర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్ర‌మంలో ఏసీబీ అధికారుల సూచనల మేరకు.. నల్లగొండ ఎక్సైజ్‌ స్టేషన్ వద్ద సీఐ వెంకటేశ్వర్లు వాహనంలో డబ్బులు పెట్టడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సీఐ యమునాధర్ రావు అరెస్ట్ తోపాటు నల్లగొండ ఎక్సైజ్‌ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అలాగే ఏక కాలంలో హైదరాబాద్‌ కొత్తపేటలో ఉన్న సీఐ యమునాధర్ రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement