హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతీ ఏటా సీట్లు పెద్ద సంఖ్యలోనే మిగిలిపోతున్నాయి. డిమాండ్ లేని సివిల్, మెకానికల్, తదితర కోర్సులకు సంబంధించిన సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఎంసెట్ ఫైనల్ ఫేజ్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు మంగళవారం పూర్తి చేశారు. తుది విడతలో 26094 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా ఇంకా 19,412 సీట్లు మిగిలాయి. ఇందులో ఇంజనీరింగ్ సీట్లు 15,447 కాగా, ఫార్మసీ సీట్లు 3965 ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 177 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 79,346 ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మొదటి, రెండో, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో 63,899 (80.53 శాతం) సీట్టు నిండాయి. ఇంకా 15,447 ఇంజనీరింగ్ సీట్లు నిండలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీలు 16కాగా, అందులో 4914 సీట్లకు 3771 (76.73 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 1143 సీట్లు మిగిలాయి. యూనివర్సిటీ కాలేజీల్లోనూ ఇలా సీట్లు మిగిలిపోతుండటం గమనార్హం. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీలు తెలంగాణలో 2 ఉన్నాయి. వీటిలోని 1478 ఇంజనీరింగ్ సీట్లలో 1074 (72.66 శాతం) సీట్లు మాత్రమే నిండగా ఇంకా 404 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 159 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని 72,954 సీట్లల్లో ఫైనల్ ఫేజ్ వరకు మొత్తం 59,054 (80.94 శాతం) సీట్లు భర్తీకాగా, ఇంకా 13,900 సీట్లు మిగిలిపోయాయి. మొత్తంగా చూసుకుంటే 177 ఇంజనీరింగ్ కాలేజీల్లో 79,346 సీట్లకు 63,899 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్‌లో 99 శాతం మిగులు…
రాష్ట్రంలో 171 కాలేజీల్లో 4025 ఫార్మసీ, ఫార్మ్-డి సీట్లు ఉన్నాయి. అయితే వీటిని ఎంపీసీ స్ట్రీమ్ వాళ్లతో నింపుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 60 (1.49 శాతం) సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫార్మసీ విభాగంలో నాలుగు ప్రభుత్వ యూనవర్సిటీ కాలేజీల్లో 132 సీట్లకు 9 సీట్లు మాత్రమే ఇప్పటి వరకు నిండాయి. ఇంకా 123 సీట్లు భర్తీ కాలేదు. ఒక ప్రభుత్వ కాలేజీలోని 20 సీట్లకు 20 సీట్లు భర్తీ కాలేదు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీలో 39 సీట్లల్లో ఒక్క సీటు కూడా నిండలేదు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 109 ఉండగా అందులో 3218 సీట్లకు 27 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తంగా ఫార్మసీ 109 కాలేజీల్లో 3409 సీట్లకు 36 సీట్లు (1.05 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి.
రాష్ట్రంలోని 56 కాలేజీల్లో ఫార్మ్-డి సీట్లు 616 ఉన్నాయి. అయితే వీటిలో ఇప్పటి వరకు 24 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 592 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో 12 సీట్లకు మూడు సీట్లు భర్తీ కాగా, 9 సీట్లు మిగిలే ఉన్నాయి. 55 ప్రైవేట్ కాలేజీల్లో 604 సీట్లకు 21 సీట్లు కేటాయించగా ఇంకా 583 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. మొత్తంగా ఫార్మసీ, ఫార్మ్-డి కాలేజీల్లోని 4025 సీట్లల్లో 60 సీట్లు (1.49శాతం) మాత్రమే భర్తీ కాగా ఇంకా 3965 సీట్లు మిగిలేఉన్నాయి.
సివిల్, మెకానికల్లో 32 శాతమే..
కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 93 శాతం సీట్లు నిండగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్‌ల్లో 76 శాతం సీట్లు నిండితే.. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 32 శాతం సీట్లు మాత్రమే నిండాయి. ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ 44 శాతం సీట్లు నిండాయి. ఇంజనీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోగా సీటు పొందిన కాలేజీల్లో చేరాలని అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కాగా, కౌన్సెలింగ్‌లో 100 శాతం అడ్మిషన్లు నిండిన కాలేజీలు 28 ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రభుత్వ యూనివర్సిటీ కాగా, మరో 27 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి.