Saturday, November 23, 2024

తెలంగాణలో మరో 15 జాతీయ రహదారులు

722 కి.మీ.లను ఎన్‌హెచ్‌ ప్రమాణాల మేరకు డబుల్‌ లేన్లుగా అభివృద్ధి
10 రోడ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి, మరో 5 రోడ్లకు త్వరలో టెండర్ల ఆహ్వానం


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో మరో 15 రోడ్లు జాతీయ రహదారులుగా మారనున్నాయి. రెండేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభమైన రోడ్ల పనులు వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తం 722 కి.మీ.ల పొడవునా జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌) ప్రమాణాల మేరకు డబుల్‌ లేన్ల రోడ్లుగా మార్చేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే 10 రోడ్లకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, మరో 5 రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను త్వరలో ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో రోడ్లకు మహార్ధశ కల్పించడంలో భాగంగా రూ.7,937 కోట్లతో 722 కి.మీ.ల పొడవునా డబుల్‌ లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రధాన రోడ్లను దశలవారీగా అత్యున్నత ప్రమాణాలతో ఆధునీకరించి జాతీయ రహదారులుగా మారుస్తున్నది.

2022-23 వార్షిక ప్రణాళికలోని రోడ్లకు డీపీఆర్‌ల రూపకల్పన, సాంకేతికపరమైన మంజూరీలు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త టెండర్లను ఆహ్వానించనున్నారు. ఇప్పటి వరకు వలిగొండ-తొర్రూరు సెక్షన్‌ 69.12 కి.మీ.లు రూ.549.28 కోట్లతో, సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్‌ 63 కి.మీ.లు రూ.576 కోట్లతో, దుద్దెడ-జనగాం 45.57 కి.మీ.లు రూ.423.48 కోట్లతో, మహబూబ్‌నగర్‌-చించోలి సెక్షన్‌ 60 కి.మీ.లు రూ.703 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. అలాగే, మెదక్‌-సిద్దిపేట సెక్షన్‌ 69 కి.మీ.లు రూ.882 కోట్లతో, మహబూబ్‌నగర్‌-చించోలి సెక్షన్‌ 42 కి.మీ.లు రూ.631 కోట్లతో, బోధన్‌-భైంసా-బాసర సెక్షన్‌ 56.4 కి.మీ.లు రూ.644 కోట్లతో, కల్వకుర్తి-కొల్లాపూర్‌ సెక్షన్‌ 79.3 కి.మీ.లు రూ.886 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. కాగా, మెదక్‌-ఎల్లారెడ్డి 43.91 కి.మీ.లు రూ.399.01 కోట్లతో, ఎల్లారెడ్డి-రుద్రూర్‌ 51.67 రూ.499 కోట్లతో, ఖమ్మం-కురవి సెక్షన్‌ 37.43 సెక్షన్‌ రూ.445.76 , ఆదిలాబాద్‌-బేల జంక్షన్‌ రూ.490 కోట్ల వ్యయంతో 32.97 కి.మీ.లు, మిర్యాలగూడ పట్టణంలోని 6 కి.మీ.ల రోడ్ల నిర్మాణం రూ.124 కోట్ల వ్యయంతో పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పాటైన తరువాత 2014 నుంచి 8 ఏళ్లలో రూ.438 కోట్ల వ్యయంతో 23 ఆర్వోబీ, ఆర్యూబీలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement