Saturday, November 23, 2024

హజ్‌-2024 యాత్రకు 11వేల దరఖాస్తులు.. లాటరీలో యాత్రికుల ఎంపిక..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మక్కాలో జరగనున్న హజ్‌-2024 యాత్ర కోసం 11,146 మంది ఆసక్తి గల ముస్లిం సోదరులు తెలంగాణ నుంచి దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో సహా 33 జిల్లా నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే భక్తులకు సంబంధించి డిసెంబర్‌ 5 నుంచి జనవరి 15 వరకు తలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో 70 ఏళ్లు దాటిన 378 మంది వృద్ధులు రిజర్వ్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకోగా, మెహరంలేని 45 ఏళ్లు దాటిన 119 మంది ముస్లింలలో షియా వర్గానికి చెందిన మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు.

మిగతా 10,649 మంది జనరల్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా 70 ఏళ్లు దాటిన 378 మందితో సహా షియా వర్గానికి చెందిన 119 మంది అందరిని కలుపుకుని 497 మంది నేరుగా హజ్‌ యాత్రకు ఎంపికైనట్లు హజ్‌ కమిటీ తెలిపింది. వీరిన కేంద్ర హజ్‌ కమిటీ ఖరారు చేయనుంది. హజ్‌ యాత్రికుల ఎంపిక ఈనెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర హజ్‌ కమిటీ ఖారారు చేయనుంది.

- Advertisement -

హజ్‌-2024 యాత్రకు ఎంపికైన యాత్రికులు తొలి విడతగా 81,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు అదనంగా రూ.300లు దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. జీవితంలో కేవలం ఒకేసారి హజ్‌ కమిటీ ద్వారా యాత్రకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మెహ్రం (షరియత్‌ చట్టం ప్రకారం మహిళతో ప్రయాణించే భర్త లేదా, కొడుకు తదితరులు) 70 ఏళ్ల పైబడిన వ్యక్తులకు తోడుగా ప్రయాణించే వారికి కేంద్ర హజ్‌ కమిటీ నిబంధనలకనుగుణంగా అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

రెండో విడతగా రూ. లక్షా 70 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతతో పాటు రెండో విడత వాయిదాను చెల్లించే అవకాశాన్ని కూడ హజ్‌ కమిటీ కల్పించింది. అయితే మూడో విడతలో చెల్లించాల్సిన వాయిదాను ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం శవ్వాల్‌ మాసంలో చెల్లించాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది. హజ్‌ యాత్రకు వెళ్తున ప్రతీ ఒక్కరికి దాదాపు రూ.3,25,000 ఖర్చు అవుతున్నట్లు, అరబ్బులో రియాల్‌ ధర మార్పుల ఆధారంగా మూడో కిస్తులో హెచ్చుతగ్గులుంటాయని కమిటీ సూచించింది.

గత ఏడాది తెలంగాణ రాష్ట్రంతో సహా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన మొత్తం 7,40మంది హజ్‌ యాత్రకు వెళ్లినట్లు కమిటీ వెల్లడించింది. తెలంగాణ నుంచి 5,583 మంది యాత్రికులు వెళ్లగా, కర్ణాటకకు చెందిన 876, మహారాష్ట్రకు చెందిన 528, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 49, బీహార్‌కు చెందిన 3, ఛత్తీస్‌ గఢ్‌కు చెందిన 7, ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు హైదరాబాద్‌ నుంచి వెళ్లినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement