హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య మరింత చేరువకానుంది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విద్యను అందించే వాటిలో యూనివర్శిటీలు, అనుబంధ, ప్రైవేట్ విద్యాసంస్థలే ఉండేవి. ఇకపై కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. పదకొండింటిలో ఇప్పటికే ఒక కాలేజీని ఏర్పాటు చేస్త్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయగా, మరో 10 ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
దీనిపై ప్రభుత్వ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈమేరకు అధికారులు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు-తో ఇన్నాళ్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నిర్వహణ బాధ్యతల్లో తలమునకలైన సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఇక నుంచి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ప్రతిపాదిత కాలేజీలన్నీ గతంలో సెకండ్షిప్ట్n పాలిటెక్నిక్ కాలేజీలే కావడం గమనార్హం.
ఈ కాలేజీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలూ పాలిటెక్నిక్ తరగతులు నిర్వహించే వారు. అడ్మిషన్లు కూడా వేర్వేరుగా ఉండేవి. అయితే ఈ కాలేజీల్లో రెండోషిప్ట్‌ను రద్దుచేసి, ఈ కాలేజీలను రోజంతా నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కాలేజీల్లో ఇన్‌టెక్ అలాగే ఉండగా, ఫ్యాకల్టీ ఆయా కాలేజీల్లోనే పనిచేస్తున్నారు. ఈ కాలేజీల్లో అదునాతన ల్యాబ్‌లున్నాయి. పీహెచ్డీ అర్హత గల ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు.
ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే కేవలం ఒక్క ఇంజినీరింగ్ కాలేజీకి సరిపోయే భవనాలను కట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో పాలిటెక్నిక్ కోర్సులతో పాటు, ఇంజినీరింగ్ కోర్సులను నిర్వహిస్తారు. కొత్తగా ఏర్పాటయ్యే ఇంజనీరింగ్ కాలేజీల్లో 4 హైదరాబాద్‌లో, 7 మిగతా జిల్లాల్లో అందుబాటులోకి రానున్నాయి.
కూలికుతుబ్షా ప్రభుత్వ పాలిటెక్నిక్ చందులాల్ బరాదరి-హైదరాబాద్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రాన్రిక్స్ మారేడుపల్లి, ప్రభుత్వ పాలిటెక్నిక్ మాసాబ్‌ట్యాంక్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ గచ్చిబౌలి, ప్రభుత్వ పాలిటెక్నిక్ మహబూబ్‌నగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ నల్గొండ, ప్రభుత్వ పాలిటెక్నిక్ వరంగల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ నిజామాబాద్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కొత్తగూడెం, ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి.
ఇక కోస్గిలో మహిళా ఇంజినీరింగ్ కాలేజీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి ప్రభుత్వ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరయ్యింది. కోస్గిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్ కాలేజీగా అప్‌గ్రేడ్‌చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది రాష్ట్రంలోని తొలి మహిళా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీగా ఏర్పాటైంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఈ కాలేజీలో అడ్మిషన్లను చేపట్టనుండగా, మిగతా కాలేజీలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కోస్గి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (ఏఐఎంఎల్), కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (డేటాసైన్స్) కోర్సులను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అనుమతినిస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులోకి రానుండడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్, సాంకేతిక విద్య మరింత చేరువ కానుంది. ఇవి అందుబాటులోకి వస్తే ఇంజనీరింగ్ సీట్లు కూడా రాష్ట్రంలో భారీగా పెరగనున్నాయి.