జడ్చర్లకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇవ్వాల (బుధవారం) ఓ కారు ప్రమాదానికి గురయ్యింది. అందులో 3 నెలల పసిపాప, తల్లితోపాటు వారి కుటుంబ సభ్యులు ఇరుక్కుపోయారు. వారిని కారులో నుంచి బయటికి తీయగా అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో CPR (చాతిపై ప్రెస్ చేసి, నోటి ద్వారా గాలి పంపి గుండె పనిచేసేలా చేయడం) చేస్తూ 108 వేహికల్‌కి కాల్ చేశారు. అయితే.. 45 నిమిషాల దాకా అంబులెన్స్ రాకపోవడంతో పోలీసులు వారి వాహనంలోనే జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్ కి పాపని తీసుకెళ్లారు. అయినా అప్పటికే ఆలస్యం కావడంతో ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో AIYF అధ్యక్షుడు పోలోజు లక్ష్మణాచారి జడ్చర్ల నుండి హైదరాబాద్ వస్తున్నారు. ఈ బాధాకర ఘటనను చూసి చిన్నారి మృతికి బాధ్యులెవరు అని ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగిన 45 నిమిషాలు దాటినా అంబులెన్స్ రాకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అని ఏఐవైఎఫ్ సంఘం విమర్శలు గుప్పించింది. త్వరగా 108 వాహనం వచ్చి ఉంటే చిన్నారి ప్రాణం దక్కేదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంపై ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని, 108 వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.